ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలికలు, మహిళలకు రక్షణ లేదనడానికి మదనపల్లి ఘటన ఒక ఉదాహరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 10:28 AM

మదనపల్లిలో ఏడు సంవత్సరాల అమాయక బాలికపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసి, డ్రమ్ములో కుక్కిన అమానుష ఘటనపై వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.  చిన్నారి ప్రాణం తీసిన ఈ రాక్షసత్వం మన సమాజానికి మచ్చ అని,  రాష్ట్రంలో చట్టం–వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే దానికి ఇది నిదర్శనమ‌న్నారు. అమాయక బాలికను కాపాడలేని ప్రభుత్వం ప్రజలకు భద్రత ఎలా కల్పిస్తుంది? అని ఆయ‌న ఎక్స్ వేదిక‌గా కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా..మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గు చేటు కాదా. బాలిక కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారు? నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం, ఆపై హత్య. వైయస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలోని ఏ.కంబాలదిన్నెలో మూడేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం. ఆపై హత్య.తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం. ఆపై హత్య. చంద్రబాబుగారూ.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు, మహిళలపై ఇలాంటి ఎన్నో దారుణమైన  ఘటనలు జరిగినా, వాటిని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారన్నది నిజం. ఎల్లోమీడియాను వాడుకుని హడావిడి ప్రకటనలు చేయడం ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేయడం.. మీకు రొటీన్‌ అయిపోయింది. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారు మాజీ మంత్రులు అయిన వారి ఇళ్లమీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం,  వారిపై హత్యాయత్నాలు చేయించడంపై మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంపై లేదు.మీ ప్రభుత్వంలో హోంమంత్రిగారు లా అండ్‌ ఆర్డర్‌కు బాధ్యత వహించరు, మీ కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ,  అందరి శాఖల్లో వేలుపెడతాడు. ఏ మంత్రీ దేనికీ బాధ్యత వహించరు.  ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు. ప్రభుత్వంలో ఉన్నవారికి ఇప్పుడు ఒకటే పని.. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారు? మీరు సృష్టించిన పొలిటికల్‌ గవర్నెన్స్‌తో, రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది? మీ పాలనా వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? ప్రతిరోజూ భయంతో బతకాలా? పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే, బాధితులపైనే ఎదురుకేసులు పెట్టి, అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఒక టీడీపీ నాయకడు మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం చేస్తే, కేసు కట్టి, అరెస్టు చేయాల్సిన పోలీసులు, 3 రోజులు స్టేషన్‌ చుట్టూ తిప్పి, చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపైనే హత్యాయత్నం కేసు పెట్టి, జైళ్లకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరి ఇక రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుంది? అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa