ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ‌న‌గ రైతుల‌కి ప్రభుత్వం అండగా నిలవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 10:33 AM

శ‌న‌గ రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి డిమాండ్ చేశారు. వైయ‌స్ఆర్‌ కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల మెట్ట ప్రాంతాల్లో కలిపి సుమారు 9.2 లక్షల ఎకరాల్లో శనగ సాగు జరిగినట్లు అంచనా ఉందన్నారు. ఈ రబీలో 6 లక్షల టన్నులకుపైగా ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.విదేశాల నుంచి తక్కువ సుంకంతో దిగుమతి అవుతున్న శనగల కారణంగా గత మూడు రబీ సీజన్లుగా రాష్ట్ర రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024, 2025 రబీ సీజన్లలో రైతులు తమ ఉత్పత్తిని డిస్ట్రెస్ సేల్‌కు అమ్ముకోవాల్సి వచ్చిందని, 2026 రబీలో కూడా అదే పరిస్థితి కొనసాగితే రైతులు తీవ్ర సంక్షోభంలో పడతారని హెచ్చరించారు.ప్రస్తుతం రాష్ట్రంలో శనగ హార్వెస్టింగ్ ప్రారంభమైందని, మార్కెట్‌లో క్వింటాల్‌కు కేవలం రూ.5,000 మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ.5,875గా ఉన్నప్పటికీ అమలు కావడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్‌కు రూ.8,000కు పైగా ధర లభించిందని గుర్తు చేశారు. 2025 రబీ శనగలు నష్టానికి అమ్ముకుని ఇంకా కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది గత సంవత్సరంతో పోలిస్తే 11.5 లక్షల ఎకరాల్లో శనగ సాగు పెరిగిందని, మన రాష్ట్రంలో కూడా సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో ధరలు మరింత పడిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం, కేంద్రంలో ఒకే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున నాఫెడ్ అనుమతి తీసుకుని ప్రధానంగా శనగ పండే జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa