ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనపై ఓటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాలు స్పష్టం చేశాయి. సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్ల రూపాయిలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా ఓట్లు పడకపోవడం వైసీపీ అధినేత జగన్‌ను ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధపొందిన లబ్ధిదారులు ఓట్లు వేస్తారని భావించిన జగన్ ఆశలు నెరవేరలేదు. ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేశామని జగన్ చెప్పుకున్న గొప్పలను ప్రజలు విశ్వసించలేదు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి.. సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు అప్పులు చేయడం ప్రజలకు నచ్చలేదు. రాజధాని విషయంలో జగన్ నిర్ణయాన్ని ప్రజలు తప్పుపట్టారనేది ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేసినా.. పేద, మధ్య తరగతి ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేసినా ఓట్లు ఎందుకు పడలేదనే ప్రశ్నకు వైసీపీ నాయకులకే సమాధానం దొరకడంలేదట. వైసీపీ ఇంతటి ఘోర పరజాయానికి కారణం ఏమిటో అర్థం కావడంలేదట. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదంటే ప్రజలు జగన్ తీరుపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతోంది. వైసీపీ ఓటమికి జగన్ పాలనాతీరు ఒక కారణమైతే.. మరోకటి జగన్ ప్రవర్తన అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. ముఖ్యంగా ఐదేళ్ల పాలనలో ఏ మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారనేది ఒక ఎత్తైతే.. ప్రభుత్వ ప్రవర్తన ఏ విధంగా ఉందనేది మరో ఎత్తు. వైసీసీ అధినేత జగన్‌తో పాటు ఆయన మంత్రివర్గంలోని సహచరుల ప్రవర్తన ప్రజలకు నచ్చకపోవడంతోనే ఈ విధమైన తీర్పు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.