దశాబ్దిన్నర కాలంపాటు చీపురుపల్లిలో కొనసాగిన బొత్స సత్యన్నారాయణ హవాకు బ్రేకులు పడ్డాయి. వైసీపీకి పెట్టని కోటగా మారిన చీపురుపల్లిలో సైకిల్ స్పీడుకు ఫ్యాన్ రెక్కలు తెగి పడ్డాయి. తెలుగుదేశం కూటమి తరపున పోటీ చేసిన కిమిడి కళావెంకటరావు, బొత్స సత్యనారాయణపై 11639 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాగా 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచీ ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండేది. 1983 నుంచి 2004 వరకూ ఆ పార్టీ అభ్యర్థులే వరుస విజయాలు సాధించారు. 2004లో మొదటిసారిగా చీపురుపల్లి నుంచి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన బొత్స సత్యన్నారాయణ గద్దే బాబూరావుపై గెలిచి దేశం హవాకు అడ్డు తగిలారు. 2009లో కూడా ఆయనే ప్రాతినిధ్యం వహించారు. 2014లో ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కిమిడి మృణాళిని గెలిచారు. అంతలోనే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి దిగిన బొత్స సత్యన్నారాయణ చీపురుపల్లి నియోజకవర్గాన్ని తిరిగి వైసీపీ ఖాతాలో చేర్చారు. కాగా బొత్సపై ఘన విజయం సాధించిన కళావెంకటరావు మొదటి రౌండు తప్ప, మిగిలిన అన్ని రౌండ్లలో ఆధిక్యత కనబరిచారు.