దెందులూరులో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఓటమితో వైయస్ఆర్సీపీ వీరాభిమాని రామారావుగూడెం యువకుడు సూరవరపు సాయిలింగాచార్యులు(23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడేనికి చెందిన సాయిలింగాచార్యులు వైయస్ఆర్సీపీకి, కొఠారు అబ్బయ్యచౌదరికి వీరాభిమాని. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. జూన్ నాలుగో తేదీన వెలువడిన ఫలితాలు చూసి మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం అబ్బయ్యచౌదరిని కలుస్తానని చెప్పి బయలుదేరగా వైయస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల దాడులు జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజులు ఆగి వెళదామని స్థానిక వైయస్ఆర్సీపీ నేతలు నచ్చజెప్పారు. ఈ క్రమంలో అభిమాన నేత ఓటమిని భరించలేక.. తీవ్ర మనోవేదనతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి ఆత్మహత్య సమాచారం అందుకున్న అబ్బయ్యచౌదరి ఏలూరు వైద్యశాలకు వెళ్లి సాయి భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.