వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనపై సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలేటి ఉమామహేశ్వరరావు, పిల్లి సురేంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ అరాచక పాలన అంతమొందించడానికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిసికట్టుగా కృషి చేశారంటూ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి ఉమామహేశ్వరరావు వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై విపరీతంగా దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి వారు గట్టి బుద్ధి చెప్పారన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మైనింగ్, లిక్కర్ని ఆదాయ వనరులుగా మార్చుకున్నారన్నారు. విపరీతంగా మైనింగ్ చేసి పర్యావరణానికి హాని కలిగించారని, పిచ్చి పిచ్చి మద్యం బ్రాండ్లతో పేదల జీవితాలతో ఆటలాడుకున్నారని పాలేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.