అనంతపురం జిల్లా, డీ.హీరేహాళ్ మండలంలోని పులకుర్తి బస్టాండ్ వద్ద కారు ఢీ కొనడంతో నరసింహ అనే 14 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు మండలంలోని పులకుర్తి గ్రామానికి చెందిన హనుమంతు కుమారుడు నరసింహ గర్భిణి అయిన తన అక్కతో కలిసి బళ్లారికి వెళ్లేందుకు పులకుర్తి గ్రామ సమీపంలో ఉన్న బస్టాండ్‌కు వెళ్లాడు. ఈ సమయంలో అక్కడకి వచ్చిన ఆటోను ఆపి తన అక్కను తీసుకొని వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా బళ్లారి వైపు నుంచి వస్తున్న కేఏ 03 ఎం జడ్ 7290 అనే నెంబర్ గల కారు ఆ బాలుడిని ఢీ కొంది. దీంతో ఆ బాలుడు గాల్లోకి లేచి అదే వాహనం టాప్‌పైకి పడి రోడ్డు అవతలకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని బళ్లారి విమ్స్ కు తీసుకెళ్లారు. అయితే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.