నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు విదేశీ నేతలు హాజరవుతున్నారు. వీరిలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కూడా ఉన్నారు. గతేడాది నవంబరులో జరిగిన మాల్దీవుల ఎన్నికల్లో విజయం సాధించిన మయిజ్జు.. అధికారం చేపట్టిన తర్వాత భారత్‌తో అంటీముట్టునట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఆయనకు సాదర స్వాగతం లభించింది.
మోదీ ప్రమాణస్వీకారానికి భారత్ ఆహ్వానాన్ని ముయిజ్జు స్వీకరించినట్లు అక్కడి మీడియాలో ప్రచారం జరిగినా.. భారత్ పర్యటనపై మాల్దీవుల అధ్యక్ష భవనం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ, ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో మోదీ అభినందిస్తూ ఎక్స్ వేదికగా బుధవారం ముయిజ్జు పోస్ట్ పెట్టారు.
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతుండటం చాలా సంతోషంగా ఉందని.. శ్రేయస్సు, స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరుదేశాలకు ప్రయోజనం కలిగేలా కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్‌కు తొలి అధికారిక పర్యటన ఇదే.
గతేడాది నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన ముయిజ్జు.. చైనా అనుకూల విధానాలను అవలంభిస్తున్నారు. వాస్తవానికి భారత్ వ్యతిరేక నినాదంతో ఆయన ఎన్నికల్లో గెలిచారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారత్ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో మే 10 నాటికి మొత్తం 88 మంది ఆర్మీ సిబ్బంది అక్కడి నుంచి స్వదేశానికి చేరుకున్నారు. మరోవైపు, మాల్దీవుల్లో పరిశ్రమలు, నిర్మాణ ప్రాజెక్టుల కోసం చైనా వైపే ముయిజ్జు మొగ్గు చూపుతున్నారు.