కేంద్రంలో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రివర్గం కొలువుదీరింది. 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఏపీ వంతు వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈనెల12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ కేంద్రప్రభుత్వంలో చేరడంతో.. రాష్ట్రప్రభుత్వంలో జనసేన, బీజేపీ భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాము ప్రభుత్వంలో ఉంటూనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పారు. దీంతో రెండు బాధ్యతలు ఎలా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరిగింది. అయితే తాజాగా ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంలో జనసేన భాగస్వామికానుందనే ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు కీలక మంత్రిత్వ శాఖ అప్పగించడంతో పాటు డిప్యూటీ సీఎం హోదాను ఇచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు 21మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ మంత్రివర్గంలో మాత్రం జనసేనకు అధిక ప్రాధాన్యత ఉండే ఛాన్స్ ఉందనే చర్చ నడుస్తోంది. కనీసం ఐదుకు తగ్గకుండా మంత్రి పదవులు వస్తాయని జనసేన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.