వన్నెపూడిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్ వర్మపై జరిగిన దాడి, తదనంతర పరిణామాలు పార్టీ దృష్టికి వచ్చాయని, దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇందులో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పుచేసిన వారిని ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తాటిపర్తి గ్రామంలో జరిగిన సంఘటన గురించి తమకు సమాచారం ఉందని, పిఠాపురం కో-ఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో స్థానిక నేతలతో చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జనసైనికులందరూ సంయమనం పాటించాలని కోరారు. సాధ్యమైనంత వరకూ తాను కూడా నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటానని, సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకుందామని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.