ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం మండలంలోని యర్రపోతవరం లాకులవద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం చేతికి శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. అంతేకాకుండా గ్రామ సర్పంచ్ పిల్లి రాంబాబును, ఒక దళిత సామాజిక వర్గాన్ని దూషిస్తూ, కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా పిచ్చి రాతలు రాశారు. ఆదివారం ఉదయం ఇది గమనించిన దళితులు ఆందోళనకు దిగారు. దళిత నాయకులు రవ్వ భూషణం, ఈరెళ్ళ రాజు తదితరులు దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.