2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అందుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వేదికైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా బీజేపీ కేంద్ర పెద్దలు, సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి వంటి సినీ తారలు.. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి అతిరథుల మధ్య ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది. ఇక చంద్రబాబు ఎప్పుడెప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఎదురు చూసిన తెలుగు తమ్ముళ్లు.. ఆయన చంద్రబాబు అనే నేను అని అనగానే సభా ప్రాంగణాన్ని మొత్తం మార్మోగించారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో గ్యాలరీల్లోని నందమూరి, నారా కుటుంబాలతో పాటుగా.. సభకు హాజరైన అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున కేరింతలు కొట్టారు.ఈ క్రమంలోనే గ్యాలరీలోని ఓ వ్యక్తి ఆనందంతో కేరింతలు కొడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన ఎవరో కాదు.. విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అప్పలనాయుడు ఆనందంతో లేచి నిలబడి కేరింతలు కొట్టారు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఎవరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజనం.. నిజమైన చంద్రబాబు అభిమాని.. ఏ స్థానంలో ఉన్నా ఆయన తన అభిమానాన్ని మరిచిపోలేదంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన కలిశెట్టి అప్పలనాయుడు.. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌పై 2,38,216 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అప్పలనాయుడు.. ఒకప్పుడు ఈనాడు సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరి కార్యకర్త నుంచి నియోజకవర్గ నాయకుడిగా ఎదిగారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ విజయనగరం నియోజకవర్లంలో అంచెలంచెలుగా ఎదిగిన అప్పలనాయుడు..చంద్రబాబునాయుడు, లోకేష్ దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత విజయనగరం ఎంపీ స్థానానికి టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచి.. ఘన విజయం సాధించారు.
అయితే మొదటి నుంచి టీడీపీలో పనిచేస్తూ వచ్చిన అప్పలనాయుడికి అధినేత చంద్రబాబు అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానంతోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఉద్వేగాన్ని, ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. లేచి నిలబడి కేరింతలు కొడుతూ చంద్రబాబుపై తన అభిమానం చాటుకున్నారు.