జమ్మూ కశ్మీర్‌లో ముష్కర మూకల వరుస దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే మూడోసారి దాడికి తెగబడ్డారు. తాజాగా, మంగళవారం రాత్రి దోడా జిల్లాలో సైనిక స్థావరంపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. దోడా జిల్లా ఛాతర్‌గలా ప్రాంతంలోని సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఏర్పాటుచేసిన తాత్కాలిక చెక్ పాయింట్‌పై తీవ్రవాదులు దాడిచేసినట్టు పోలీసులు వెల్లడించారు. దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు.
జమ్మూ జోన్ అదనపు డీజీపీ ఆనంద్ జైన్ మాట్లాడుతూ.. దోడాలోని ఛాతర్‌గలా ప్రాంతంలో పోలీస్, రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్త తాత్కాలిక స్థావరంపై మంగళవారం రాత్రి తీవ్రవాదులు దాడిచేశారని చెప్పారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టిందని, ఉగ్రవాదుల ఏరివేతకు అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నట్టు తెలిపారు.
ఆదివారం సాయంత్రం రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో బస్సు లోయలోపడి 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 41 మంది గాయపడ్డారు. లోయలో పడిపోయిన బస్సుపై అరగంట పాటు కొండ మీద నుంచి ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనకు పాల్పడిన కొద్ది గంటల్లో సోమవారం కథువాలో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పౌరులు గాయపడ్డారు. అయితే, సైన్యం ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. కథువాలోని హీరానగర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపాన ఉన్న సైదా సుఖుల్ గ్రామంపై ఉగ్రవాదులు దాడిచేసినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.