ఆధార్ కార్డు- రేషన్ కార్డును లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ అనుసంధానం గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2024 జూన్ 30తోనే అసలు గడువు ముగియనుండగా.. తాజాగా దీనిని సెప్టెంబర్ 30 వరకు పెంచింది. రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న తరుణంలో అవకతవకల్ని అడ్డుకునేందుకు ఆధార్ కార్డు- రేషన్ కార్డును లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఆదేశించింది. ఇప్పటికే చాలా మంది ఈ ఆధార్- రేషన్ అనుసంధానం పూర్తి చేశారు.
రేషన్ కార్డు- ఆధార్ కార్డు అనుసంధానం వల్ల అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందడంతో సహా నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఆధార్ రేషన్ కార్డులు లింక్ చేయని వారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని కోసం సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) సాయంతో అనుసంధానం చేసుకోవచ్చు.
ఇందుకోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని పత్రాలు అవసరం పడతాయి. బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో లింకింగ్ పూర్తి చేయొచ్చు. ఆన్‌లైన్ పోర్టల్ నుంచి కూడా అనుసంధానం చేసే వెసులుబాటు ఉంటుంది. దీని కోసం రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్‌కు వెళ్లి.. 'Link Aadhaar with the Active Ration Card' ఆప్షన్ ఎంచుకోవాలి. ఆధార్ కార్డు నంబర్, రేషన్ కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత మీ మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడంతో ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది.
ఆధార్ కార్డు భారతీయులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ అన్న సంగతి తెలిసిందే. ఎక్కడైనా ఇది గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కూడా దీనిని ప్రాధాన్యంగా తీసుకుంటారు. అందుకే ఇలాంటి ఆధార్ కార్డును ఇటీవల పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంక్ అకౌంట్లకు అన్నింటికీ అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించింది.