కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నిధుల్లో కోత విధించి ఉపాధి పథకాన్ని కూలీలకు దూరంగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన వ్యవసాయ కార్మిక సంఘ ప్రతినిధులతో కలిసి అమలాపురం మండల పరిధిలోని బండారులంక, నడిపూడి గ్రామాల్లో పర్యటించారు. ఉపాధి కూలీల వేతన బకాయిలను చెల్లించాలన్నారు. పంటకాల్వలను మురుగు డ్రెయిన్లుగా మార్చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి కూలీలకు ఏటా 200రోజులు పని దినాలు కల్పించడం, రోజుకు రూ.600 వేతనం చెల్లించాలని డిమాండు చేశారు. కార్మిక సంఘ ప్రతినిధులు పొలమూరి శ్రీనివాసరావు, ఎం.రాజేశ్వరి, జి.తేజకుమారి, టి.లక్ష్మి, శ్రీదేవి, దుర్గాదేవి, ఎస్.నాగలక్ష్మి, జి.మంగాదేవి పాల్గొన్నారు.