రాష్ట్రమంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డీఎ్‌సబీవీ స్వామి ఈనెల 16న ఒంగోలు జిల్లాకు రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం అమరావతి నుంచి బయలుదేరి ఉమ్మడి జిల్లా సరిహద్దు బొప్పూడి వద్ద ఉన్న ఆంజేయస్వామి గుడిలో తొలుత పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి కొండపి నియోజకవర్గం ముఖద్వారమైన వల్లూరమ్మ గుడి వద్దకు చేరుకుని పూజలు చేస్తారు. అనంతరం స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెంలో అంబేడ్కర్, ఎన్‌టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు నివాళులర్పిస్తారు. తదనంతరం అభినందన సభ జరగనుంది. ఆ సభలో ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనాయకులు పాల్గొననున్నారు. ఆ మేరకు కొండపి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు చూస్తున్న పార్టీ యువనేత దామచర్ల సత్య ముఖ్యనేతలతో చర్చించి షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం. మంత్రివర్గంలో స్థానం దక్కించుకొని తొలిసారి జిల్లాకు వస్తున్న డాక్టర్ స్వామికి ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు, అభిమానులు, భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.