ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాటిన్ అమెరికాలో చైనా మెగా పోర్టు.. అగ్రరాజ్యం, డ్రాగన్ మధ్య మరో యుద్ధం

national |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 10:07 PM

ప్రపంచంపై గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తోన చైనా ఒన్ బెల్ట్ ఒన్ నేషన్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా పలు దేశాల్లో మౌలికవసతులు, ఓడరేవులను నిర్మిస్తోంది. ఇప్పటికే శ్రీలంక, పాకిస్థాన్‌లో పోర్టుల నిర్మించిన చైనా. తాజాగా సౌత్ అమెరికా ఖండంలోకి ఎంట్రీ ఇచ్చింది. దక్షిణ అమెరికా దేశం పెరూలో మెగాపోర్ట్ నిర్మాణం చేపట్టింది. దీంతో డ్రాగన్, అమెరికాల మధ్య మరో వనరులు యుద్ధానికి తెరలేచినట్టయ్యింది. పెరూలోని ఛన్సే నగరంలో చైనాకు చెందిన కోస్కో షిప్పింగ్ సంస్థ మెగా పోర్టును చేపట్టింది. ఇందుకోసం 3.5 బిలియన్ డాలర్లను ఖర్చుచేస్తోంది. ఈ పోర్టును వచ్చే నవంబరులో చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్ ప్రారంభించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల మధ్య వాణిజ్యానికి పెంపొందించడానికి, చైనా ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర ఎగుమతుల కోసం కొత్త మార్కెట్‌లను తెరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


అంతేకాదు, పసిఫిక్ మహాసముద్రంలోని దక్షిణ అమెరికా తీరంలో భారీ నౌకలు రాకపోకలు సాగించేందుకు నిర్మితవుతోన్న తొలి పోర్ట్ అని, దాదాపు 60 అడుగుల లోతు ఉంటుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. అయితే, లాటిన్ అమెరికాలో చైనా ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్న అమెరికాకు ఈ ఓడరేవు సవాల్‌గా మారింది. ఓడరేవుపై చైనా నియంత్రణ దక్షిణ అమెరికా వనరులపై తన పట్టును బీజింగ్ మరింత పటిష్టం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని అమెరికా ఆందోళన చెందుతోందని నివేదించింది. ‘ఈ ప్రాంతంలో వనరులను సంగ్రహించడానికి చైనాకు మరింత సులభతరమవుతుందని, ఇది ఆందోళనచెందాల్సిన అంశమే’ అని యూఎస్ సదరన్ కమాండ్ చీీఫ్ లౌరా రిచర్డ్‌సన్‌ వ్యాఖ్యలను ఆ కథనం ఉటంకించింది. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా, చైనా మధ్య సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి. ఇటీవల రెండు దేశాలు దౌత్యపరంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి.


చైనా మెగా పోర్టు వల్ల ఆసియా మార్కెట్‌లో కొత్త అవకాశాలను తెరుస్తుందని భావిస్తున్నారు. పెరూ తీరంలో బ్లూబెర్రీస్, అవకాడోలను పండించే డేనియల్ బుస్టమంటే మాట్లాడుతూ.. ‘ఈ పోర్టు తన పండ్ల కోసం ఆసియా మార్కెట్‌లలో కొత్త అవకాశాలను తెరుస్తుంది’ అని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు, ప్రస్తుతం ఎక్కువగా యూరప్, యుఎస్‌కు రవాణా చేస్తున్న అతడు.. ఇది ఆసియాకు మార్గం అవుతుందని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం పెరు, చైనా మధ్య నౌకల ద్వారా సరకుల రవాణాకు 35 రోజుల సమయం పడుతోంది. ఛన్సే పోర్టు అందుబాటులోకి వస్తే ఆ సమయం మూడింతలు తగ్గిపోవడమే కాదు ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం ఈ పోర్టు నిర్మాణం 70 శాతం పూర్తికాగా.. నవంబరులో పెరూ వేదికగా జరిగే ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కో-ఆపరేషన్ సదస్సు సమయంలో జిన్‌పింగ్ ప్రారంభిస్తారని భావిస్తున్నారు.


దీంతో పాటు చైనాకు చెందిన జిన్‌జావో అనుబంధ సంస్థకు దక్షిణాన ఓడరేవును నిర్మించే కాంట్రాక్టును కూడా పెరూ అప్పగించింది. 405 మిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరమయ్యే ఈ ఓడరేవు నిర్మాణం 2025 చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఒప్పందంలో భాగం 30 ఏళ్ల పాటు పోర్ట్‌ నిర్వహణను జిన్‌జా‌వో చేపడుతుంది. ఈ నౌకాశ్రయం ద్వారా 15 బిలియన్ డాలర్ల విలువైన మైనింగ్ ఉత్పత్తులు రవాణా జరగనుంది. చైనా ఒన్ బెల్డ్.. ఒన్ నేషన్ ప్రాజెక్టుపై పెరూ సహా పలు లాటిన్ అమెరికా దేశాలు సంతకాలు చేశారు. పెరూ అధ్యక్షుడు దినా బోలౌర్టే త్వరలోనే చైనాలో పర్యటించి.. జిన్‌పింగ్‌తో సమావేశమవుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com