రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ ఆస్తులను, అభివృద్ధి పథకాల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ విధ్వంసం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూడా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పలుచోట్ల విధ్వంసానికి దిగారు. తాజాగా అనంతపురం రూరల్ మండలం రాచానపల్లిలో పట్టపగలు అందరూ చూస్తుండగానే రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. వీటి పక్కనే ఉన్న జగనన్న పాలవెల్లువ ‘నేమ్ బోర్డు’ను తొలగించారు. అలానే పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం చింతలచెర్వు గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని పగులకొట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల సచివాలయం, ఆర్‌బీకే, హెల్త్ క్లినిక్ భవనాలపై దాష్టీకానికి పాల్పడ్డారు.