టీటీడీ ఈవో(కార్యనిర్వహణాధికారి)గా శ్యామలరావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన ఈవోగా నియమితులైన ఆయన తన సతీమణితో కలిసి ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. క్షేత్రసంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడినుంచి నేరుగా వైకుంఠ క్యూకాంప్లెక్స్కు వెళ్లారు. క్యూలైన్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన ఆయన రంగనాయమండపంలో టీటీడీ ఈవో (ఎఫ్ఏసీ) ఽధర్మారెడ్డి నుంచి బాధ్యతలను అందుకున్నారు. అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరిగి రంగనాయకమండపానికి చేరుకున్న నూతన ఈవో దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత జేఈవో వీరబ్రహ్మం శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.