ఏపీలో ప్రభుత్వం ఏర్పడింది. మంత్రి వర్గం కొలువుదీరింది. ఈనెల 19వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను సభ ఎన్నుకోనుంది. ఇప్పటికే స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షంగా ఉన్న జనసేనకు డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీకి స్పీకర్, జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని కూటమి నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జనసేనలో ఈ పదవి ఎవరికి వస్తుందనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి మంత్రివర్గంలో ఇద్దరు కాపులు, ఒక ఓసీకి అవకాశం కల్పించారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది.
![]() |
![]() |