దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న నీటి సంక్షోభాన్ని తక్షణం పరిష్కరించకుంటే ఈనెల 21 నుంచి నిరవధిక దీక్షకు దిగుతానని రాష్ట్ర మంత్రి అతిషి అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రజానీకం ఎదుర్కొంటున్న నీటి కొరత, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటి పరిష్కారానికి తక్షణమే ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని బుధవారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అతిషి తెలిపారు. ''ఈరోజు ప్రధాన మంత్రికి నేను లేఖ రాశాను. ఢిల్లీలోని 28 లక్షల మంది ప్రజానీకానికి నీళ్లు రావడం లేదనే విషయాన్ని విన్నవించాను. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు నీరు అందేలా సాయం చేయాలని కోరాను. 21వ తేదీ కల్లా ఢిల్లీ ప్రజలకు దక్కాల్సిన నీటి వాటా రాకుంటే సత్యాగ్రహానికి దిగడం మినహా నాకు మరో మార్గం లేదు'' అని అతిషి తెలిపారు. జలాలకు సంబంధించిన సింహ భాగం వాటాను హర్యానా విడుదల చేయకపోవడంతో ఢిల్లీ నీటి సంక్షోభంలో పడిందన్నారు. మంగళవారంనాడు 613 ఎంజీడీలకు గాను 513 ఎంజీడీల జలాలను మాత్రమే హర్యానా విడుదల చేసిందని, ఒక్క ఎంజీడీ జలం 28,500 మందికి వెళ్తుందని, ఆ ప్రకారం 28 లక్షల మందికి నీరు అందడం లేదని ఆమె వివరించారు. ఢిల్లీ ప్రజలు తీవ్రమైన ఎండలతో పాటు నీటి కొరతను కూడా ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తెచ్చానని, రెండ్రోజుల్లోగా నీటి సమస్య పరిష్కరించకుంటే ఈనెల 21 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు వెళ్తానని చెప్పారు. హర్యానా ప్రభుత్వానికి కూడా సమస్య పరిష్కారం కోసం చాలా లేఖకు రాసినట్టు వివరించారు.