భారత్ కెనడా మధ్య తలెత్తిన దౌత్య పరమైన విభేదాలు ఇప్పట్లో ముగిసేలా లేవు. గతంలో కెనడా పార్లమెంటు వేదికగా.. భారత్ కెనడాకు వివాదం మొదలు కాగా.. తాజాగా అదే పార్లమెంటు వేదికగా మరోసారి విభేదాలు ఎక్కువయ్యాయి. ఖలిస్థానీ ఉగ్రవాది, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ.. కెనడా పార్లమెంటులో ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య వివాదం ప్రారంభం అయింది. కొన్ని నెలలుగా కెనడాకు.. భారత్‌తో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆ దేశ పార్లమెంట్.. హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతికి సంతాపం ప్రకటించడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో రెండు దేశాల మధ్య దౌత్య పరంగా మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్.. హత్య జరిగి జూన్ 18 వ తేదీకి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా జస్టిన్ ట్రూడో సర్కార్.. ఏకంగా ఆ దేశ పార్లమెంట్ ప్రత్యేకంగా నివాళులు అర్పించడం.. సంతాప కార్యక్రమం నిర్వహించడం తీవ్ర దుమారానికి కారణం అయింది. ఈ సందర్భంగా కెనడా ఎంపీలు అందరూ పార్లమెంటులో లేచి నిలబడి మౌనం పాటించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించడం.. ఇంటర్‌పోల్ వాంటెడ్ లిస్ట్‌లో అతని పేరు ఉండగా.. అతడి హత్యకు ఓ దేశ పార్లమెంట్‌లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లతో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
గతేడాది జూన్ 18 వ తేదీన కెనడా బ్రిటిష్ కొలంబియాలోని సర్రే అనే ప్రాంతంలో ఉన్న ఓ గురుద్వారా బయట.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. ఈ నేపథ్యంలోనే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ.. ఏకంగా కెనడా పార్లమెంటులో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా.. తమపై నిందలు వేయడం తగదని తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇక ఈ హత్య ఘటనపై దర్యాప్తు చేపట్టిన కెనడా ప్రభుత్వం.. మొత్తం ఇప్పటివరకు నలుగురు భారతీయులను అరెస్ట్ చేసింది.