యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తామని టీడీపీ నేతలు చెప్తున్నారు.. యూనివర్సిటీల్లోకి వెళ్లి వీసీలపై దాడులు చేయటం ప్రక్షాళన అంటారా? అంటూ వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. వీసీల కారు డ్రైవర్లపై దాడులు చేయటం ప్రక్షాళనా?. వైయస్ఆర్ విగ్రహాలను తొలగించటం ప్రక్షాళనా?. మరి ఎన్టీఆర్ విగ్రహాలను ఎందుకు తొలగించలేదు?’’ అని నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.‘‘అనేక యూనివర్సిటీలలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వీసీలు, రిజిస్టార్లు లేరా?. ఎస్వీ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలలో చంద్రబాబు, లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరపలేదా?. యూనివర్సిటీలను చంద్రబాబు హయాంలో కులాలకు అడ్డాగా మార్చారు. చంద్రబాబు హయాంలో కంటే వైయస్ జగన్ హయాంలోనే ర్యాంకింగ్ పెరిగింది. ఉన్నత విద్య విషయంలో జగన్ అనేక మార్పులు తెచ్చారు’’ అని నాగార్జున యాదవ్ చెప్పారు.‘‘విదేశాల్లోని అత్యున్నత యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని కొత్తకొత్త పాఠ్యాంశాలు తెచ్చారు. విద్యార్థులకు ఉపయోగకరమైన పనులు చేశారు. 3,295 పోస్టుల ఖాళీలను పూర్తి చేయటానికి వైయస్ జగన్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై కూడా కోర్టుకు వెళ్లి ఆపేసిన నీచ చరిత్ర టీడీపీది’’ అంటూ నాగార్జున యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు వేదిక చేసిందే చంద్రబాబు, నారా లోకేష్ అని నాగార్జున యాదవ్ విమర్శించారు. వైస్ చాన్సలర్లపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడటం హేయమన్నారు. ప్రొఫెసర్లు అనే గౌరవం లేకుండా దూషించడం నీచమన్నారు.