రాష్ట్రంలోని పేద ప్రజల కోసం అందరి సహకారంతో త్రికరణ శుద్ధితో పనిచేసి పథకాల ఫలాలు అందిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో , పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలను సందర్శించానని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటించానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు కొన్ని తనకు తెలుసని, ఇంకా విస్తృతంగా తెలుసుకుని వారికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. అరకు లాంటి గిరిజన ప్రాంతాల్లోని మహిళలు తాగునీటి కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో స్వయంగా చూశానని చెప్పారు. గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల్లో రాజకీయ జోక్యం తగ్గించాలని.. తమ సొంత పార్టీ నేతలైనా కలుగజేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా 2028 లోపు ప్రతి ఇంటికీ కొళాయి నీరు ఇచ్చే విధంగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తాగునీటిని అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. అన్ని పంచాయతీలకు రోడ్డు కనెక్టివిటీ ఉండాలని, ఆ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ప్రణాళికలతో ముందుకు రావాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పరిజ్ఞానం తనకు అంతగా లేదని, ఒక విద్యార్థిగా అన్నీ విషయాలు నేర్చుకుంటానని.. అధికారులు తనకు బోధించాలని కోరారు. ఇన్‌చార్జి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కన్నబాబు తమ శాఖకు సంబంధించి పలు విషయాలు వివరించారు. రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు, ఎన్ని మండలాలు, ఎన్ని జిల్లా పరిషత్‌లు, ఎన్నికలు జరిగిన స్థానిక సంస్థలు, జరగకుండా పెండింగ్‌లో ఉన్నవి.. స్థానిక సంస్థలకు అందుతున్న కేంద్ర నిధులు, పంచాయతీరాజ్‌శాఖలో డీఎల్‌డీవో, డీపీవో విభాగాలు, అవి పనిచేస్తున్న తీరు, ఆయా విభాగాల్లో ఉన్న సిబ్బంది తదితర విషయాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయాల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి అడుగగా.. కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ సుధాకర్‌రావు వేర్వేరు జవాబులిచ్చారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసినప్పుడు తెచ్చిన జీవో 110 ప్రకారం గ్రామ పంచాయతీలు, సచివాలయాలు వేరు కాదన్నారని.. ఆ తర్వాత వేర్వేరు అంటూ విడదీశారని సుధాకర్‌రావు వివరిస్తుండగా కన్నబాబు వారించారు. ఆ జీవో తానే ఇచ్చానని, సచివాలయాలు సంక్షేమ కార్యక్రమాల కోసమని, గ్రామ పంచాయతీలు వేరని తెలిపారు. ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుందని పవన్ అడుగగా.. కేరళలో వ్యవస్థ ఆదర్శంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో మైనర్ మినరల్స్ ద్వారా గ్రామ పంచాయతీలకు రావల్సిన రూ.7-8 వేల కోట్ల సీనరేజ్ చార్జీలు వచ్చాయా అని ఉపముఖ్యమంత్రి అడిగారు. ఆ వివరాలు అందించాలని సుధాకర్‌రావుకు సూచించారు. తాను గ్రామాల్లో తిరుగుతానని, ఘన వ్యర్థ నిర్వహణ షెడ్‌లకు సంబంధించి బాగా అమల్లో ఉన్న గ్రామం, బాగా లేని గ్రామాలను గుర్తించి చెప్పాలన్నారు. పారిశుధ్యం గురించి పవన్ కల్యాణ్ లాంటి సెలబ్రిటీలు ఒక నినాదమిస్తే గ్రామీణ యువత పాటించే అవకాశముందని, బ్రాండ్ అంబాసిడర్‌లాగా ఉపముఖ్యమంత్రి సేవలు వినియోగించుకోవచ్చని శశిభూషణ్ తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ హయాంలో 25.23 లక్షల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశామని, గత ప్రభుత్వంలో కాంట్రాక్టులను రద్దు చేయడంతో చాలా చోట్ల నిర్వీర్యమయ్యాయని.. వాటిపై దృష్టి సారించాలని కన్నబాబు కోరారు. గ్రామ కంఠం అంటే ఏంటి.. స్వామిత్వ పథకం ద్వారా పేదలు, ప్రభుత్వ స్థలాలకు పట్టాలు ఏ విధంగా లభిస్తాయని పవన్ అడిగి తెలుసుకున్నారు.