రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రైతులు 1631 రోజులుగా ఆందోళన చేపట్టారని అన్నారు. రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని తెలిపారు. ఇక్కడి రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శమని చెప్పారు. అమరావతిలో గురువారం చంద్రబాబు పర్యటించారు. అమరావతి పరిధిలో కీలకమైన అన్ని ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఐకానిక్ సెక్రటేరియట్, అసెంబ్లీ, జడ్జిల నివాస సముదాయం, ప్రజాప్రతినిధుల నివాస సముదాయం సహా అన్నింటినీ పరిశీలించారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందని అన్నారు. ఏపీ అంటే అమరావతి, పోలవరమని ఉద్ఘాటించారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలు పెట్టామని చెప్పారు. అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని మండిపడ్డారు.