ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్‌కు జెల్ల తగిలింది. సస్పెండ్ చేసిన చేతులతోనే పునర్మియామకం ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు భార్య డాక్టర్ లావణ్య దేవి ఏయూ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో భర్తకు సహకారం అందించడానికి సెలవు పెట్టారు. ఆ సమయంలో పెదగంట్యాడలో పెంటమాంబ అమ్మవారి జాతర జరిగింది. దానికి భర్తతో కలిసి వెళ్లారు. అక్కడ ఎన్నికల ప్రచారం చేశారంటూ ఏయూ వీసీ ప్రసాదరెడ్డి బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దాంతో ఆర్‌డీఓతో కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) విచారణ చేయించారు. ఆ నివేదిక వీసీకి పంపించారు. ఈ నేపథ్యంలో లావణ్యదేవిని రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ సస్పెండ్ చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు అని ఆనాడే విమర్శలు వచ్చాయి. వాటిని పట్టించుకునే అలవాటు లేని వీసీ, రిజిస్ట్రార్ లెక్క చేయలేదు. ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అధికారంలోకి రావడంతో దీనిపై మరోసారి విచారణ చేశారు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆదేశం మేరకు ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ, తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నామని అదే రిజిస్ట్రార్ స్టీఫెన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.