గత ఐదేళ్ళ కాలంలో పేద ప్రజలకు ఇచ్చే రేషన్ సరుకుల్లోనూ అవినీతి చోటు చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల రాష్ట్రంలోని కొన్ని సివిల్ సప్లయిస్ గోడౌన్లను తనిఖీ చేసినప్పుడు పలు అక్రమాలు బయటపడ్డాయి. దీంతో అన్ని జిల్లాల్లో తనిఖీ చేసి నివేదికలు అందజేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.దీంతో చిత్తూరు జిల్లా అధికారులు నెల వారీగా లెక్కలు తీస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని అంగన్‌వాడీలకు ఇక్కడినుంచే బియ్యం, కందిపప్పు, ఆయిల్ వంటివి సరపరా చేస్తున్నారు. పంచదార, కందిపప్పు సరఫరాలో కాంట్రాక్టర్లు తూకాల్లో మోసం చేస్తున్నారని అధికారులంటున్నారు. ఒక్కో రేషన్ షాపు పరిధిలో కనీసం 10 కార్డులకు రేషన్ పంపిణీ కావడం లేదని గుర్తించారు.ఎండీయూ వాహనాలు వచ్చినప్పుడు కార్డుదారులు బయటకు వెళ్లివుంటే కందిపప్పు, బియ్యం, చక్కెర మిగిలిపోతున్నాయి. వీటికి లెక్కలు చూపడం లేదు.పేదలకు ఇస్తున్న బియ్యం, చక్కెరల్లోనూ కిలోకు 100 గ్రాములు లెక్కన తక్కువ పంపిణీ చేస్తున్నట్లు బయటపడింది.ఈ విషయమై సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ సుమతిని అడగ్గా జిల్లా వ్యాప్తంగా వున్న 12 గోడౌన్లు, మండల స్టాకు పాయింట్లలో కందిపప్పు, బియ్యం, చక్కెర స్టాకును పరిశీలించామన్నారు. తూకాల్లో తేడా వున్న మాట వాస్తవమేనని చెప్పారు. ప్రధానంగా కిలో కందిపప్పుపై 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు తూకం తక్కువ వున్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. అలాగే చక్కెర తూకంలోనూ కిలోపై 30 గ్రాముల వరకు తక్కువున్నట్లు బయటపడిందన్నారు. ఇకపై ప్రతి నెలా నిత్యావసర వస్తువులు తనిఖీ చేసి తూకాల్లో మోసం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.