కాలేజీ అయిపోగానే విద్యార్థులు డైరెక్టుగా హైదరాబాద్ బస్సెక్కుతుంటారు. ఏదైనా కోర్స్ నేర్చుకోడానికో.. లేదా ఉద్యోగం నిమిత్తమో విద్యార్థులు.. హైదరాబాద్ వచ్చేస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్లు ఎక్కడుంటారయ్యా అంటే.. కొంతమంది తమకు తెలిసిన స్నేహితుల గదుల్లో సర్దుకుంటే.. చాలా మందికి హాస్టళ్లే శరణ్యం. ఇక్కడ మనం పెట్టే డబ్బులను బట్టి హస్టళ్లు ఉంటాయి. బడ్జెట్ ప్రెండ్లీ హాస్టళ్లు కావాలంటే మాత్రం బెడ్ నుంచి ఫుడ్ వరకు చాలా విషయాల్లో కాంప్రెమైజ్ కావాల్సి ఉంటుంది. అదే మంచి హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు బాగుంటాయని.. ఇన్ని రోజులు అదే అనుకున్నారందరూ.. కానీ మంచి ఫీజులు వసూలు చేసే హాస్టళ్లలో కూడా సౌకర్యాల పరిస్థితి ఎలా ఉన్నా.. భోజనాల విషయంలో మాత్రం ఆందోళనకర పరిస్థితులే ఉన్నట్టు బయటపడింది.
హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై యుద్ధం ప్రకటించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. పేరు మోసిన పెద్ద పెద్ద హోటళ్ల బండారాన్ని బయటపెడుతున్నారు. కాగా.. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు.. నగరంలోని హాస్టళ్లపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రైవేట్ హాస్టళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. హాస్టళ్లలో కూడా హోటళ్ల కిచెన్‌లలో కనిపించిన పరిస్థితులే దర్శనమివ్వటం ఆదోళనకరం.
కొన్ని హాస్టళ్లలో ఎక్స్‌పైరీ అయిన మసాలాలు, కుళ్లి బూజుపట్టిన కూరగాయలను అధికారులు గుర్తించారు. కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం, క్లీన్‌గా లేని ఫ్రిడ్జ్, తుప్పుపట్టిన దోశ పెనాలు, గ్రైండర్లు గలీజుగా ఉండడం, కిచెన్ గోడలపై గుట్కా ఉమ్మేసిన మరకలతో పాటు పురుగులు, బొద్దింకలు తిరగటాన్ని చూసి.. అధికారులు అవాక్కయ్యారు. అంతేకాదు.. డ్రింకింగ్ వాటర్‌లో కూడా పీహెచ్ లేవల్స్ ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
మాదాపూర్ అయ్యప్ప సోసైటీలోని పలు హాస్టళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేశారు. ఫుడ్ లైసెన్స్ లేకపోగా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆహార పదార్థాలను బయట స్టోర్ చేయడాన్ని అధికారులు గమనించారు. ఐటీ ఏరియాలో పలు హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు.. నోటీసులు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోతే అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
క్లీనింగ్ ఏరియా అపరిశుభ్రంగా ఉండడం.. డస్ట్ బీన్స్ సక్రమంగా నిర్వహించకపోవడాన్ని గుర్తించిన అధికారులు నిర్వాహకులపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టోర్ చేసిన పల్లీలు, చింతపండులాంటి పలు ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని హాస్టళ్లపై దాడులు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. హాస్టల్స్ నిర్వాహకులు లైసెన్స్‌తో పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.