ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. శనివారం సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ భేటీలో సుధీర్ఘంగా చర్చించిన చంద్రబాబు నాయుడు.. లావు శ్రీకృష్ణదేవరాయలును టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఖరారు చేశారు. పార్టీ పార్లమెంటరీ భేటీలో టీడీపీ ఎంపీలు, నారా లోకేష్ పాల్గొన్నారు. టీడీపీ తరుఫున ఎంపీలుగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి ఎవరికి ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. చివరకు ఈ పదవికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేరును ఖరారు చేశారు.
ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిలను ఎంపిక చేశారు. అలాగే కోశాధికారిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో ఈసారి టీడీపీ కీలకంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీల బలం ఉంది. టీడీపీ మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులను సాధించాలని చంద్రబాబు ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. అలాగే జూన్ 24 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపైనా వారికి వివరించారు. సమావేశాల్లో రాష్ట్రం తరుఫున ఏయే అంశాలను ప్రస్తావించాలనే దానిపై మార్గనిర్దేశం చేశారు చంద్రబాబు.
మరోవైపు నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైసీపీ తరుఫున ఎంపీగా గెలుపొందారు లావు శ్రీకృష్ణదేవరాయలు. అయితే 2024 ఎన్నికలకు ముందు వైసీపీ సిద్ధాంతాలతో విభేదించి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం టీడీపీలో చేరిన ఆయన.. 2024 ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మీద లక్షా 59 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమితులయ్యారు.
కేంద్రమంత్రులుగా పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడులకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు.. యువకుడైన లావు శ్రీకృష్ణదేవరాయలకు పార్టమెంటరీ పార్టీ నేత పదవి కట్టబెట్టారు. ఆ రకంగా ఢిల్లీలో టీడీపీ తరుఫున యువకులను మోహరించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.