సబ్బుపై కాలు వేసి మూడో అంతస్తు నుంచి జారి కిందపడింది ఓ మహిళ. భర్త కాపాడేందుకు ప్రయత్నం చేసినా.. చేతుల్లో నుంచి జారిపోయింది. కింద పార్క్ చేసి ఉన్న బైకులపై పడి తలకు తీవ్ర గాయమై ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. బెంగళూరు నగర శివార్లలోని కనకనగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులోని డీజే హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకనగర్లో జూన్ 19న ఈ ఘటన చోటు చేసుకుంది. రుబాయి అనే 27 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి ఆర్.కె. అపార్ట్‌మెంట్ భవనం టెర్రాస్‌పై పనిచేస్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సబ్బు బార్‌పై కాలు వేసింది. ఆ ఉదుటకు ఒక్కసారిగా జారి పడిపోయింది.
పక్కనే రుబాయి భర్త.. ఆమెను కాపాడేందుకు చేతిని పట్టుకున్నాడు. కొన్ని క్షణాల పాటు భర్త చేతిని పట్టుకొని వేలాడుతూ అలాగే ఉండిపోయింది. అది గమనించిన స్థానికులు భవనం కింది భాగంలో గుమిగూడారు. కాసేపటి తర్వాత భర్త చేతుల్లో నుంచి జారి కింద పడిపోయింది రుబాయి. సబ్బు నీటితో పనిచేస్తుండటం వల్ల చేయి జారిపోయి పట్టు కోల్పోయినట్లు తెలుస్తోంది.
స్థానికులు బట్టల సాయంతో మహిళను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ మహిళ అక్కడే పార్క్ చేసి ఉన్న బైక్‌లపై పడి తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ఎదురుగా ఉన్న భవనం పైనుంచి ఓ వ్యక్తి ఈ ఘటనను తన సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. రుబాయి ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.