మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడిగానే కాకుండా బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన గేట్స్ దంపతులు మూడేళ్ల కిందట విడాకులు తీసుకోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి గేట్స్ దంపతులు 2021లో ముగింపు పలికి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విడాకులపై మిలిండ్ ఫ్రెంచ్ గేట్స్ తొలిసారి బహిరంగంగా స్పందించారు. విడాకులు తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. అయితే, అంతకు ముందే చాలా కాలం నుంచి గేట్స్‌కు దూరంగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు
పిల్లల సంరక్షణ సహా ఇతర బాధ్యతలను సమతౌల్యం చేసుకుంటూ అత్యంత క్లిష్టమైన అంశాన్ని సమర్థంగా దాటగలిగానని మిలిండా అభిప్రాయపడ్డారు. విడాకులను తన జీవితంలో జరిగిన‘బాధాకరమైన విషయం’గా అభివర్ణించిన ఆమె.. ఆ తర్వాత మాత్రం తన జీవితం అద్భుతంగా సాగుతోందని వ్యాఖ్యానించారు. తన పనులను తాను చేసుకుంటున్నానని చెప్పారు. ‘‘ఓ సాధారణ వ్యక్తిలా ఇరుగుపొరుగు వారితో కలిసి ఉంటున్నాను.. సూపర్ మార్కెట్‌కు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడం, నచ్చినప్పుడు రెస్టారెంట్‌కు వెళ్లి తినడం ఇలా చిన్న చిన్న అంశాలతో జీవితం ఆనందంగా ఉంది’’ అని ఆమె తెలిపారు.
విడాకుల సమయంలో మాత్రం జీవితంలో ఎలా ముందుకెళ్లాలి? పిల్లల పరిస్థితేంటి? ఫౌండేషన్ బాగోగులెలా? నా మనసంతా ఇలాంటి ఆలోచనలతోనే నిండిపోయిందని మిలిండా అన్నారు. ఈ మూడు అంశాల కోసమే తీవ్రంగా ఆలోచించేదాన్ని అని, ఎందుకంటే ఇవి ఒకదానితో ఒకటి పెనవేసుకున్నవని తెలిపారు. ఎట్టకేలకు అవన్నీ సాఫీగా జరిగిపోవడంతో ఎంతో భారం దిగిపోయినట్టు అనిపిస్తోందని ఆమె వివరించారు. ఇందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు.
కాగా, ఒప్పందం ప్రకారం గేట్స్ ఫౌండేషన్ నుంచి ఇటీవలే మిలిండా బయటకొచ్చారు. సొంతంగా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మహిళల సాధికారత, వారి హక్కులు, ఆర్థిక స్వావలంబన కోసం ఇటీవలే బిలియన్ డాలర్ల నిధిని ఆమె ప్రకటించారు.
అత్యంత చిన్నవయసులోనే మైక్రోసాఫ్ట్‌ను స్థాపించిన బిల్‌గేట్స్.. ఆ సంస్థకు సీఈవోగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌లో ప్రొడక్ట్ మేనేజరుగా 1987లో చేరిన మిలిండా.. అప్పట్లో ఆ సంస్థలో చేరిన ఏకైక ఎంబీఏ మహిళా గ్రాడ్యుయేట్ కావడం విశేషం. ఆ తర్వాత ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడటంతో 1994లో వివాహం చేసుకోగా.. వీరికి ముగ్గురు సంతానం. కానీ, లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌కు సంబంధాలే విడాకులకు కారణమని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా దూరం ఏర్పడి చివరకు విడాకులకు దారితీసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.