రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గతంలో అధికారంలో ఉన్నప్పటి వైఖరికి భిన్నంగా ప్రస్తుతం ప్రవర్తిస్తున్నారు. గతంలో అమెరికా ఫస్ట్.. మిగితా దేశాలన్నీ లాస్ట్ అనే నినాదంతో.. విదేశీయుల పట్ల వైఖరి అనుసరించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం మాత్రం ఆ వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చేవారిపై ట్రంప్ ధోరణి మారినట్లు అర్థం అవుతోంది.
ప్రపంచ దేశాల నుంచి ఉన్నత చదువులు చదువుకునేందుకు చాలా మంది.. అమెరికాకు చేరుకుంటారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగాలు చూసుకుని.. పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఇచ్చే గ్రీన్ కార్డుల విషయంలో ట్రంప్ ఆసక్తికరమైన ప్రతిపాదనలు చేశారు. కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే వారికి గ్రీన్ కార్డులు అందించేందుకు.. తాము అధికారంలోకి వస్తే కృషి చేస్తామని అన్నారు. తాజాగా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాలోని కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడంపై ఎలాంటి ప్రణాళికలు ఏంటని అడిగిన ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ ఈ సమాధానం ఇచ్చారు. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే వలస వాదులపై తరచూ విమర్శలు చేసే ట్రంప్.. తొలిసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాలేజీల నుంచి స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్లు కాగానే.. అమెరికాలో ఉండేందుకు వీలుగా వారికి డిగ్రీతోపాటు నేరుగా గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ గ్రాడ్యుయేషన్ 2, 4 ఏళ్లు అనేదానితో సంబంధం లేదని పేర్కొన్నారు. జూనియర్ కాలేజీలకు కూడా దీన్ని వర్తింపజేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి.. తాను అధికారంలోకి వచ్చిన తొలిరోజే దీనిపై దృష్టి సారిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగానే గతంలో ఈ విధానాన్ని తాను అమలు చేయలేకపోయానని సమర్థించుకున్నారు. వీసా రావడంలో ఆలస్యం, ఇతర సమస్యల కారణంగా భారత్, చైనా సహా వివిధ దేశాల నుంచి అమెరికాకు వస్తున్న చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఉండలేకపోతున్నారని తెలిపారు. వారంతా అమెరికాలో చదివి.. తిరిగి సొంత దేశాలకు వెళ్లి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా విదేశీ వలస విధానంపై ట్రంప్ తరచుగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ వాటికి భిన్నంగా ఈసారి ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వివిధ దేశాల నుంచి అక్రమ వలసదారులు అమెరికాలో నిరుద్యోగం, హింస, నేరాలు, వనరుల దోపిడీకి కారణమవుతున్నారని పలు సందర్భాల్లో తీవ్ర సంచలన విమర్శలు చేసిన ట్రంప్.. తాను అధికారంలోకి రాగానే వారందరినీ తిరిగి వారి స్వదేశాలకు పంపిస్తానని గతంలో హామీ ఇచ్చారు. అక్రమంగా అమెరికాకు వలస వచ్చేవారిపైనే తమ దృష్టి ఉంటుందని ట్రంప్ సన్నిహితులు పలుమార్లు వివరణ ఇచ్చారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు చట్టబద్ధ వలసదారులపైనా ఆంక్షలు విధించారు. కుటుంబ ఆధారిత వీసాలు, వీసా లాటరీ విధానంలో మార్పులు చేశారు. 2017లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. బై అమెరికన్.. హైర్ అమెరికన్ పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు.