గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ - జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఒకటే ప్రశ్న దేశం మొత్తం వినిపిస్తోంది. దాదాపు అన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్‌ను మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. ఫలితంగా పెట్రోల్, డీజిల్ విషయంలో వినియోగదారులు అధిక పన్నులు చెల్లించాల్సి వస్తోంది. ఇక దీని గురించి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అయిన ప్రతీసారి చర్చకు వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూడా ఇదే ప్రశ్న తలెత్తింది. అయితే ఈ జీఎస్టీ కౌన్సిల్ భేటీ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సానుకూలంగానే ఉందని.. నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పన్ను రేటుపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలని సూచించారు. రాష్ట్రాలు పన్ను రేటును నిర్ణయించిన తర్వాత పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. దివంగత అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం.. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే నిర్ణయంపై తాము అనుకూలంగా ఉన్నామని వెల్లడించారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీఎస్టీ మండలి సభ్యులతోపాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే ప్లాట్‌ఫాం టికెట్లతోపాటు విద్యా సంస్థల బయట ఉండే ప్రైవేట్ హాస్టల్‌లను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నెలకు రూ.20 వేల కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేటు హాస్టల్‌లకు ఈ జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. గతంలో విద్యా సంస్థలకు అనుబంధంగా హాస్టళ్లకే మాత్రమే ఈ మినహాయింపు ఉండేది. వీటితోపాటు అన్ని పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ, కార్టన్ బాక్సులపై 18 శాతం నుంచి 12 శాతానికి పన్నును తగ్గిస్తున్నట్లు పేర్కొంది. రైల్వేల్లో ప్లాట్‌ఫాం టికెట్లు, వెయిటింగ్ రూమ్స్, వెయిటింగ్ హాల్స్, సామానులు భద్రపరిచే గదులు, బ్యాటరీ వాహనాలు, రైల్వేశాఖలో అంతర్గత లావాదేవీలపై జీఎస్టీ మినహాయింపునకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రైల్వేల్లో ప్రత్యేక వాహక సంస్థలకు కూడా ఈ పన్ను మినహాయింపు వర్తించనుంది.
ఇక ఎరువులపై జీఎస్టీ మినహాయింపు అంశాన్ని పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ స్పష్టం చేసింది. స్టీలు, ఇనుము, అల్యూమినియం మిల్క్ క్యాన్లపై జీఎస్టీని 12 శాతానికి పరిమితం చేసింది. ఇక కార్టన్ బాక్సులపై 18 శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గింది. సోలార్ కుక్కర్లు, స్ప్రింక్లర్లపై జీఎస్టీ ఇక నుంచి 12 శాతం మాత్రమే వసూలు చేయనున్నారు. విమానాల విడి భాగాలు, టెస్టింగ్ సామాన్ల దిగుమతిపై 5 శాతం జీఎస్టీ విధించనున్నారు. కోళ్ల ఫారాల యంత్రాలపై 12 శాతం జీఎస్టీ వేయనున్నారు. రక్షణ, పరిశోధనలకు సంబంధించిన వాటి దిగుమతులపై 2029 వరకూ జీఎస్టీ మినహాయింపును పొడగించారు.
వ్యాపారులకు ఇచ్చే పన్ను డిమాండు నోటీసుల సందర్భంగా విధించే పెనాల్టీలపై వడ్డీని మినహాయిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ పన్నులపై వివాదాల్లో కోర్టులకు వెళ్లేందుకు పరిమితులను విధించారు. రూ.20 లక్షల వరకు ఉండే కేసులకు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు.. రూ.1 కోటి వరకు ఉండే కేసులకు హైకోర్టులకు, రూ.2 కోట్ల వరకూ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.