ఏపీలో అన్నదాతలకు శుభవార్త. బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తారు వర్షం కురుస్తుందని అంచనా వేసింది. కొన్నిచోట్ల భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే అనకాపల్లి, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో ఇటీవల పర్యటించిన కేంద్ర బృందం కరవు పరిస్థితిపై కేంద్రానికి నివేదిక సమర్పించింది. రబీ సీజన్‌కు సంబంధించి ఏపీలో కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఇటీవలే ఏపీలో పర్యటించింది. పది మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందం మూడు టీమ్‌లుగా విడిపోయి రాష్ట్రంలో పర్యటించింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక టీమ్.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రెండవ బృందం.. నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో మూడో టీమ్ పర్యటించింది.
తమ పర్యటనలో స్థానికంగా ఉన్న రైతులను, పంటపొలాలను పరిశీలించి నివేదిక తయారుచేసింది. అనంతరం రబీ సీజన్‌లో నష్టపోయిన పంటల వివరాలను కేంద్రానికి నివేదిక రూపంలో సమర్పించింది.ఏపీలో రైతులను ఆదుకోవడానికి సత్వరమే రూ.319.77 కోట్లు సాయం చేయాలని కేంద్ర బృందం.. కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ఉపాధి హామీ పథకం కింద అదనంగా మరో 50 పని రోజులు కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.