నవమోసాలు మోసి కనిపెంచిన అమ్మ.. కళ్లముందు అపస్మారక స్థితిలో పడి ఉంది. పేగు తెంచి జన్మనిచ్చిన బంధం.. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కన్నతల్లి కళ్లముందు.. అలా పడి ఉండటం చూసిన అ చిన్నారికి ఏం చేయాలో తెలీలేదు. అమ్మకు ఏమైందోననే ఆందోళన.. ఎలాగైనా కాపాడుకోవాలనే తాపత్రయం.. ఆ చిన్నారిని పరుగు తీయించాయి. మా అమ్మను కాపాడండి అంటూ పోలీస్ స్టేషన్ గడపదొక్కేలా చేశాయి. అమ్మను కాపాడుకోవాలనే తాపత్రయంలో కిలోమీటరు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు పరుగు పరుగున వెళ్లిన ఆ బాలిక .. పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వేగంగా స్పందించటంతో ఆ అమ్మ ప్రాణం నిలబడింది. కన్న తల్లిని కాపాడుకోవాలనే ఆ కూతురి తాపత్రయం నెరవేరింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్లచింతలగూడెనికి చెందిన దానయ్య, లక్ష్మి భార్యాభర్తలు. కూలీ పని చేసుకుంటూ జీవించే వీరికి.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు ఇందు 8వ తరగతి చదువుతుండగా.. చిన్నమ్మాయి లాస్య ఐదో తరగతి చదువుతోంది. అయితే గత కొంతకాలంగా దానయ్య, లక్ష్మి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే శనివారం స్కూలుకు వెళ్లిన ఇందు మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చింది. అయితే ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లక్ష్మి అపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో ఇందుకు ఏం చేయాలో పాలుపోలేదు. తల్లి చీమలమందు తాగిన విషయం గుర్తించింది. వెంటనే ఆలస్యం చేయకుండా.. ఇంటి పక్కనే బడిలో ఉన్న చెల్లెలు లాస్య దగ్గరకు పరుగు తీసింది.
చెల్లెలు లాస్యను వెంటబెట్టుకుని అమ్మను కాపాడుకోవాలనే తాపత్రయంతో పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టింది ఇందు. సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ చేరుకుని.. తన తల్లి అపస్మారకస్థితిలో పడిపోయిందని.. చీమల మందు తాగిందని పోలీసులకు చెప్పింది. చిన్నారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే స్పందించారు. స్థానిక ఎస్సై సతీష్.. ముగ్గురు పోలీసులను ఆమె ఇంటికి పంపారు. చిన్నారులను వెంటబెట్టుకుని ఇంటికి చేరుకున్న పోలీసులు.. చీమలమందు తాగిన లక్ష్మిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు గోపాలపురం ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
మరోవైపు కన్నతల్లిని కాపాడుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు పరుగున వచ్చిన చిన్నారులను పోలీసులు, స్థానికులు అభినందిస్తున్నారు. అలాగే దానయ్యను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. ఆపద సమయంలో భయపడకుండా కన్నతల్లిని కాపాడుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు బాలికలను పోలీసులు అభినందించారు.