ఏపీలో ఇప్పుడు అమరావతి పేరు మళ్లీ మార్మోగిపోతోంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో రాజధాని అమరావతి అంశం కాస్త వెనుకబడిపోయింది. అమరావతి అంటే రైతుల ఉద్యమమే తప్ప మరో వార్త వినిపించేది కాదు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఏపీలో అమరావతి పేరు మళ్లీ బలంగా వినిపిస్తోంది. అమరావతే తమ రాజధాని అని ఎన్నికలకు ముందు చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి వచ్చి సీఎం అయ్యాక అమరావతే ఏపీ రాజధాని అని పునరుద్ఘాటించారు. అలాగే ఏపీ అంటే అమరావతి, పోలవరం అని అర్థం చెప్పారు చంద్రబాబు. ఇక అమరావతిలో పర్యటించి.. తమ హయాంలో నిర్మించిన భవనాలను, రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాలకు కూడా పరిశీలించారు.
అలాగే టీడీపీ అధికారంలోకి రావటంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ రేట్లు కూడా పెరిగాయని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అమరావతికి మరో గుడ్ న్యూస్ అందుతోంది. అమరావతిలో తమ కార్యాలయాల ఏర్పాటుకు కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. గతంలో అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ సంస్థలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ సహా 10 నుంచి 15 కేంద్ర సంస్థలు, జాతీయ బ్యాంకులకు అప్పట్లో భూములు కేటాయించారు. తాజాగా తమకు కేటాయించిన స్థలం చూపించాలని కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు.. సీఆర్‌డీఏ అధికారులను కోరినట్లు సమాచారం.
అమరావతి నిర్మాణంపై దృష్టిపెట్టిన టీడీపీ ప్రభుత్వం అక్కడ పునరుద్ధరణ పనులను కూడా చేపట్టింది. ముళ్లకంచెలు తొలగింపు దగ్గర నుంచి రోడ్లు, విద్యుత్ దీపాల పునర్మిర్మాణం వంటి పనులను చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించముందే ప్రారంభించారు. తాజాగా అమరావతికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను రప్పించే ప్రయత్నాల్లో సీఆర్డీఏ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో భూములు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుపై వారి ప్లాన్లు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన స్థలాలను చూసి నిర్ణయం చెబుతామని కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు తెలిపినట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో తమకు కేటాయించిన స్థలాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వస్తే అమరావతి వైభవం దిశగా తొలి అడుగు పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.