ద్విచక్రవాహనదారుడిపై ఆవు దాడిచేయడంతో ఆ వ్యక్తి బస్సు కిందపడి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత భయానకమైన ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలిలో రెండు రోజుల కిందట చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరునల్వేలి కోర్టులో ఉద్యోగి అయిన వేలాయుథరాజ్ (58) ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. వచ్చే మార్గంలో వన్నార్‌పేట్ వద్ద రోడ్డు పక్కన రెండు ఆవులు పోట్లాడుకుంటున్నాయి. వాటిలో ఒక ఆవు ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చి బైక్‌పై దాడిచేయడంతో రాజు కిందపడిపోయాడు. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సు రావడంతో దాని చక్రాల కింద పడి ఆయన మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెట్టాయ్‌లోని తంగమ్మన్ గుడి వీధికి చెందిన వేలాయుథరాజ్.. కోర్టు అసెస్టింట్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. వన్నార్‌పేట్ సమీపంలో ఆవు దాడిచేయడంతో పట్టుతప్పి రోడ్డుపై పడిపోయాడని, ఈ సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు ఆయనపై నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. కేసు నమోదుచేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై తీవ్రంగా తిరునల్వేలి మున్సిపల్ కార్పొరేషన్.. రోడ్లపై తిరుగుతోన్న పశువులను బంధించి, షెల్టర్లకు తరలించాలని సిబ్బందిని ఆదేశించింది.
దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది మేలపాళ్యం రోడ్డులో తిరుగుతున్న 10 ఆవులను బంధించారు. మరో ఇతర ప్రాంతాల్లో ఏడింటిని అదుపులోకి తీసుకుని, షెల్టర్లకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు, వీటిని విచ్చలవిడిగా వదిలిపెడితే యజమానులకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇదిలావుండగా, నిబంధనలను అమలు చేయడంలో మున్సిల్ అధికారుల నిర్లక్ష్యంతో పాటు పశువుల యజమానులు సహకరించకపోవడం వల్లే వాహనదారుడి ప్రాణాలను బలిగొన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.