మద్యం పాలసీ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. జూన్ 26న విచారిస్తామని పేర్కొంది. అంతేకాదు, హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకూ వేచి చూడాలని కేజ్రీవాల్‌కు స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీ సీఎం మరికొన్ని రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకుంది.
రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టులో ఈడీ సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ బెయిల్‌పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. విచారణ మొదటి రోజే బెయిల్‌పై హైకోర్టు స్టే విధించాల్సిన అవసరం ఏంటి? అని వాదించారు. ఈ అంశంపై హైకోర్టు ఉత్తర్వులు వచ్చేంతవరకూ సీఎం ఎందుకు స్వేచ్ఛగా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అనుకూలంగా బెయిల్ ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు. అంతేకాదు, ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం కూడా లేదని స్పష్టం చేశారు. కానీ, సుప్రీంకోర్టు మాత్రం కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈ నెల 26న విచారిస్తామని వెల్లడించింది. ఈడీ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో.. ఆ మర్నాడు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు చెప్పడం గమనార్హం. ‘‘హైకోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచినప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో ఈడీ తరఫున హాజరైన అడిషినల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. 24 గంటల్లో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై హైకోర్టు నిర్ణయం వెలువడనుందని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు విచారణను ఆ తర్వాతే చేపడతామని తెలిపింది.