ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌పై విమర్శలతో 18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభించిన మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 10:23 PM

18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు రాష్ట్రపతి భవన్‌లో సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్‌‌తో ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పార్లమెంట్‌కు చేరుకున్న ప్రొటెం స్పీకర్.. కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. ఎన్డీయే లోక్‌సభాపక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోదీ తొలుత ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మోదీ మంత్రివర్గంలోని క్యాబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రులు, ఇతర సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తున్నారు.


ఇక, విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పాత భవనం నుంచి నూతన భవనం వరకు ర్యాలీగా వచ్చారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించిన ప్రాంతంలో రాజ్యాంగం చిరు ప్రతులను చేతపట్టుకుని కొంతసేపు నిరసన తెలియజేశారు. అనంతరం వీరంతా ఒకేసారి లోక్‌సభకు బయలుదేరారు.


ఇక, 18వ లోక్‌సభ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై విమర్శలతో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ 25 నాటికి దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్ల పూర్తవుతుందని, అది ప్రజాస్వామ్యానికి ఓ మాయని మచ్చని దుయ్యబట్టారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం మూడు రెట్లు కష్టపడి ఫలితాలను అందిస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. స్వాతంత్ర్యం అనంతరం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన రెండో ప్రభుత్వం తమదేనని, ఇది ఎంతో ప్రత్యేకమైందని అన్నారు.


‘‘60 ఏళ్ల తర్వాత ఈ అవకాశం వచ్చింది.. ప్రజలు మూడోసారి ఎన్నుకోవడం మా ప్రభుత్వ విధానాలు, అంకితభావంపై ఒక ముద్ర అని అర్థం.. ఇందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ‘‘భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాంటి అత్యవసర పరిస్థితికి రేపటితో 50 ఏళ్లు.. భారత రాజ్యాంగ్యాన్ని ఎలా రద్దు చేశారో? దేశాన్ని జైలుగా మార్చి ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశారో కొత్త తరం మర్చిపోదు.. దేశంలో అటువంటి ఘటనలు ఇంకెప్పుడూ పునరావృతం కాదని వాగ్దానం చేస్తున్నాను’’ అని మోదీ అన్నారు.


దేశానికి, ప్రజలకు సేవ చేయడానికి తమ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుందని ప్రధాని అన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమికి చురకలంటించారు. ‘భారత్‌కు బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కావాలి.. పార్లమెంట్‌లో ప్రజలకు కావాల్సింది నినాదాలు, నాటకాలు, గందరగోళం కాదు.. చర్చ, శ్రద్ద కావాలి.. ప్రజల అంచనాలకు అనుగుణంగా ప్రతిపక్షం నడుస్తుందని నేను ఆశిస్తున్నాను... ఎంపీలపై దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంటోందని, ప్రజా సంక్షేమం కోసం వీలైన ప్రతి అడుగు వేయాలి’ అని కోరారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలను అభినందించిన మోదీ.. కొత్త పార్లమెంట్ భవనంలో కొత్త ఎంపీలు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com