మంత్రులు హంగూ ఆర్భాటాలు ప్రదర్శించవద్దు. ప్రజల్లో కలిసిపొండి. వారు మీ వద్దకు రాలేని పరిస్థితులు తెచ్చుకోవద్దు. పాలకులమన్న భావంతో కాకుండా ప్రజలకు సేవకులం అన్నట్లుగా మెలగండి’ అని కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. సోమవారమిక్కడ సచివాలయంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలపై సమీక్ష ముగిసి అధికారులు వెళ్లిపోయిన తర్వాత ఆయన మంత్రులతో కొంతసేపు మాట్లాడారు. ‘ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. సభలో మొత్తం 175 సీట్లు ఉంటే 164 సీట్లు మనకే ఇచ్చారు. ప్రజలకు మనపై చాలా అంచనాలు ఉన్నాయి. దాని కోసం మనం చాలా ఎక్కువ కష్టపడాలి. కొత్త మంత్రులు తమ శాఖలపై పట్టు తెచ్చుకోవాలంటే అవగాహన బాగా పెంచుకోవాలి. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. మీ శాఖలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి’ అని తెలిపారు. బూతుల భాష వాడవద్దని మంత్రులను హెచ్చరించారు. ‘గతంలో ఎవరు ఎలా మాట్లాడారో చూశాం. ప్రజలు వారిని అసహ్యించుకున్నారు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా రాజకీయంగా సమాధానం ఇవ్వండి. బూతుల ప్రయోగాలు వద్దు. అధికారులతో సౌమ్యంగా మాట్లాడండి. పనులు కాకపోతే మన ప్రాధాన్యాలు ఏమిటో ఒకటికి రెండుసార్లు చెప్పండి. పనులు జరగని చోట ఒత్తిడి పెంచండి’ అని సూచించారు. అలాగే అధికారులతో సుదీర్ఘ సమీక్షలు నిర్వహించవద్దని, సాయంత్రం ఆరు గంటల తర్వాత వారితో సమావేశాలు పెట్టవద్దని కోరారు. క్రమం తప్పకుండా రాష్ట్ర సచివాలయానికి రావాలని.. శాఖాధిపతుల కార్యాలయాలు కూడా సందర్శించాలని అన్నారు. ‘కార్యాలయ సిబ్బందిగా మంచి వాళ్లను పెట్టుకోండి. మీ శాఖలకు సంబంధించి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక పెట్టుకుని దాని ప్రకారం పనిచేయండి. ప్రతి సమావేశానికీ సన్నద్ధమై వెళ్లండి. ఏదైనా ఒక పొరపాటు దొర్లితే అల్లరి చేయడానికి జగన్ మీడియా సదా సిద్ధంగా ఉంటుంది’ అని చెప్పారు. వచ్చే వారం నుంచి శాఖలవారీ సమీక్షలు మొదలుపెడతానన్నారు.