పోలవరం ప్రాజెక్టుపై ఈ నెల 28న శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. సీఎం స్పందిస్తూ.. ఈ నెలాఖరుకల్లా కేంద్ర జలశక్తి శాఖ నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం వస్తుందని.. వారి అధ్యయన నివేదికను బట్టి పనులు చేపడదామని చెప్పారు. అన్న క్యాంటీన్ల పునఃప్రారంభ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులను కూడా భాగస్వాములను చేస్తే బాగుంటుందని, వాటిని ఎక్కువగా వాడుకునేది వారేనని పవన్ తెలిపారు. దానికి చంద్రబాబు అంగీకరించారు. అన్న క్యాంటీన్లకు ఒక ట్రస్టు ఏర్పాటు చేస్తే.. విరాళాలు వస్తాయని, తద్వారా పేదలకు భోజన వసతిని నిరాటంకంగా కొనసాగించవచ్చని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. తిరుమలలో అన్నదాన కార్యక్రమానికి ట్రస్టు ఏర్పాటు చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలో నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ గడువు జూలై నెలాఖరు వరకూ ఉంది. ఆర్డినెన్స్ ద్వారా దీని గడువును రెండు నెలలు పొడిగించవచ్చని అధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి విముఖత చూపారు. పూర్తి బడ్జెట్‌ను తయారు చేసి జూలైలో అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకుందామన్నారు.