రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను తిరగరాయబోతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండ్రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం వచ్చారు. భారీవర్షం కురుస్తున్నా.. కుప్పం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో యువత, మహిళలు, బలహీన వర్గాలకు అవకాశమిచ్చామని.. 164 మంది కూటమి అభ్యర్థులను ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించారని తెలిపారు. వైసీపీ ఉంటే తమకు భవిష్యత్ ఉండదని వారు భయపడ్డారని చెప్పారు. కొత్త కేబినెట్‌లో 8 మంది బీసీలకు మంత్రులుగా స్థానం కల్పించామన్నారు. ప్రమాణం చేసిన వెంటనే పోలవరం, అమరావతిని సందర్శించానని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు 5 హామీలపై సంతకం చేశానన్నారు. ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి, నాసిరకం మద్యం అమ్మకాలు, భూగర్భ ఖనిజాల వంటి 7 అంశాలపై త్వరలో శ్వేతపత్రాలను విడుదల చేస్తామని తెలిపారు. వృద్ధులకు పింఛన్లను ప్రవేశపెట్టిందే ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. రూ.4 వేలకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఒకటో తేదీనే ఇంటికొచ్చి ఇస్తామన్నారు. ‘ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రజలు తోడు ఉండాలి. గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మోసం. ఇచ్చిన హామీ మేరకు ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నాం. మీ పట్టాదార్ పాస్‌పుస్తకాలపై జగన్ ఫొటో తీసేసి, మళ్లీ రాజముద్రతో పంపిణీ చేస్తాం. త్వరలో 283 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం’ అని వివరించారు.