‘మనపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్నారు. పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీలతో, వంద శాతం స్ట్రైక్‌రేట్‌తో గెలిపించి శాసనసభకు పంపించారు. వారి ఆశలు, ఆకాంక్షలను సభలో ప్రతిఫలింపచేద్దాం’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్దేశించారు. అసెంబ్లీ వ్యవహారాలు, నియమావళి, సంప్రదాయాలపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పార్టీ నుంచి గెలిచిన వారిలో ఎక్కువ శాతం శాసనసభ వ్యవహారాలకు కొత్తవారేనని, అందరం సభ నియమావళి, సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవడంతో పాటు వాటిని పాటించి, గౌరవించాలని సూచించారు. ‘సభలో హుందాగా ప్రవర్తించాలి. మన నడవడిక, చర్చించే విధానం ప్రజల మనన్నలు పొందాలి. తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టిపెట్టాలి. ప్రభుత్వ శాఖలు, పథకాలు, వాటి అమలు తీరును అధ్యయనం చేయాలి. ఆ తరువాత మీరు చేసే చర్చలు ఎంతో బలంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలి. ప్రజా సంక్షేమం, అభివృద్ధి సమంగా సాగాలి. గ్రామస్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరం. శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీపడొద్దు. మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.