హయగ్రీవ భూముల వ్యవహారంలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుతం కేసు ఎఫ్‌ఐఆర్ దశలోనే ఉందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఆదేశాలిచ్చారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపించారు. ఘటన జరిగిన నాలుగేళ్ల తరవాత పిటిషనర్‌పై క్రిమినల్ కేసు పెట్టారని తెలిపారు. పిటిషనర్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు.