అధికారం కోల్పోయిన అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కేటాయించాలంటూ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడికి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ లేఖ రాయడంపై బుధవారం అమరావతిలో ఆయన స్పందించారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకిస్తారని ప్రశ్నించారు. ఆ పదవి లేక పోతే ప్రజా సమస్యలపై మీరు చర్చించరా? అంటూ సి.రామచంద్రయ్య సందేహం వ్యక్తం చేశారు. అజ్ఞానాన్ని బయట పెట్టుకొంటూ నవ్వులపాటు కావడం అలవాటైపోయిందని మాజీ సీఎం వైఎస్ జగన్కు ఈ సందర్భంగా రామచంద్రయ్య చురకలంటించారు.