గత ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలకు నియమితులైన వీసీలు, రిజిస్ట్రార్లు పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవికి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి శుక్రవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా సమర్పిస్తున్నట్లు ఉన్నత విద్య కార్యదర్శికి పత్రాన్ని పంపారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ఆచార్యులుగా ఉన్న మధుజ్యోతి 2023 డిసెంబరు 29న వీసీగా బాధ్యతలు చేపట్టారు.ఇక్కడ వైసీపీ నాయకుల అండతో రిజిస్ట్రార్‌గా పదవి పొందిన ఏకే వేణుగోపాల్‌రెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జూన్ 4న రాజీనామా చేశారు. అప్పట్లో ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా మాధవ నాయుడిని వీసీ నియమించారు. ఆ మరుసటిరోజు రెక్టార్ అనురాధ కూడా రాజీనామా చేశారు. ఆమె స్థానంలో కొత్త రెక్టార్ నియామకం ఇంకా జరగలేదు. వేద విశ్వవిద్యాలయ వీసీ రాణీసదాశివమూర్తి తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు.ఎస్వీయూ వీసీ శ్రీకాంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గతంలోనే రిజిస్ట్రార్ హుస్సేన్ చేసిన రాజీనామాకు ఆమోదం లభించింది. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా చంద్రయ్యను నియమించారు. నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ సుందరవల్లి రాజీనామా చేశారు. ఈమె ఎస్వీయూ ఇంగ్లీషు విభాగంలో అధ్యాపకురాలిగా మరికొంత కాలం కొనసాగేందుకు అవకాశం ఉంది.ఆమె భర్త క్రిస్టఫర్ గతంలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. పద్మావతి యూనివర్సిటీ వీసీ భారతి ప్రస్తుతం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కోల్‌కాతాకు వెళ్ళారు.అక్కడినుంచి వచ్చాకే రాజీనామా విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.