కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. ఆ స్వామిని దర్శించుకుని తరిస్తుంటారు. అయితే పూర్తి సమాచారం తెలుసుకుని, ముందస్తు ప్రణాళికతో శ్రీవారిని కొంతమంది దర్శించుకుంటే.. మరికొంత మంది భక్తులు మాత్రం దళారులను నమ్మి మోసపోతుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలలో దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. టీటీడీ ఈవోగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన జె. శ్యామలరావు.. దీనిపై దృష్టిసారించారు. దళారీలను ఎలా అరికట్టాలనే దానిపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. ఆధార్ సంస్థ ప్రతినిధులు, టీసీఎస్, జియో, టీటీడీ ఐటీ విభాగం అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ ఈవో దళారీ వ్యవస్థను నియంత్రించే అంశమై వారితో చర్చిందారు. టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ వంటి సేవలకోసం ఆన్‌లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకుంటారని టీటీడీ ఈవో తెలిపారు. అయితే ఈ సమయంలో కూడా దళారుల బెడద తప్పడం లేదన్న ఈవో.. దళారీలను నియంత్రించేందుకు ఆధార్ లింక్ చేసే విషయమై దృష్టిసారించినట్లు చెప్పారు. ఇందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఐటీ విభాగం అధికారులను శ్యామలరావు ఆదేశించారు. ఇందు కోసం ఆధార్ సంస్థ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆధార్ ద్వారా భక్తుల గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో పాటుగా ఆధార్ డూప్లికేషన్ ఎలా కనిపెట్టాలనే అంశంపై ఆధార్ సంస్థ అధికారులతో టీటీడీ ఈవో చర్చించారు.
మరోవైపు ఈ సమీక్షా సమావేశంలోనే ఆధార్ సంస్థ అధికారులు... ఆధార్ కార్డును టీటీడీ అప్లికేషన్లకు ఎలా లింక్ చేయవచ్చు.. ఇతర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీ ఈవోకు వివరించారు. ఈ సమావేశంలో యూఐడీఏఐ డిప్యూటీ స్పీకర్ సంగీత, టీటీడీ జేఈవో ఇతర అధికారులు పాల్గొన్నారు.