2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొద్దిరోజులుగా మౌనంగా ఉన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇప్పటికే పోలవరం విషయంలో చంద్రబాబు, వైఎస్ జగన్ తీరును ఖండిస్తూ ట్వీట్ వదిలిన షర్మిల.. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కూడా వీరిద్దరే కారణమని మండిపడ్డారు. తాజాగా మరో అంశం మీద వైఎస్ షర్మిల.. చంద్రబాబును టార్గెట్ చేశారు. బిహార్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్... ఇటీవల కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నితీశ్ కుమార్ ప్రభుత్వం బిహార్ శాసనసభలో ప్రత్యేకహోదా కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకహోదా గురించి కేంద్రాన్ని ప్రశ్నించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
" బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోదీ ముందట డిమాండ్ పెడితే.. ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పడం లేదు. మోదీ సర్కార్ లో కింగ్ మేకర్‌గా ఉన్న మీరు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బిహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా ? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా ? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా? హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు ? మోసం చేసిన మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు ? ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని, చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలు కాదు...రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని అని గుర్తు చేస్తున్నాం". అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ, టీడీపీ పార్టీలు కీలకంగా ఉన్నాయి. బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రాని నేపథ్యంలో.. జేడీయూ, టీడీపీ ఎంపీల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను జేడీయూ మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ పార్టీ, వైసీపీ సహా పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరి ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ గురించి చంద్రబాబు మదిలో ఏం ఆలోచన నడుస్తోందో.. ముందుముందు తెలియనుంది.