ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను అధికారిక విప్‌లుగా ప్రకటించాలని కోరారు. ముఖ్యమంత్రి, శాసనసభాపక్షం నాయకులు నారా చంద్రబాబునాయుడుకు లేఖ రాసినట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్‌లను విప్‌లుగా నియమించమని ఆ లేఖలో పవన్ కళ్యాణ్ కోరారు. జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్‌లు విప్‌లు కావడం ఖాయమైపోయింది.. జనసేన రిక్వెస్ట్‌కు చంద్రబాబు ఓకే చెప్పనున్నారు.
బొమ్మడి నాయకర్ జనసేన పార్టీ తరఫున పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం సాధించారు. అరవ శ్రీధర్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నుంచి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.. ఈయన కూడా తొలిసారి ఎమ్మెల్యే. ఇద్దరు కొత్తవారికి విప్ పదవులు అప్పగించారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే.. మంత్రులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. ఇప్పుడు విప్ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు.
ఏపీ అసెంబ్లీలో త్వరలోనే విప్ పదవులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ నుంచి ఇంకా ఎవరి పేర్లు ప్రకటించలేదు.. చీఫ్ విప్ రేసులో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరు వినిపిస్తోంది. అసెంబ్లీలో బలాబలాలను బట్టి విప్ పదవులు కేటాయిస్తారు.. మరి ఆ లెక్కల్ని పరిగణలోకి తీసుకుని పార్టీల వారీగా విప్ పదవుల్ని కేటాయిస్తారు. మరి జనసేన పార్టీకి రెండు పదవులపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.