ఉత్తరాంధ్రలో కీలకమైన శ్రీకాకుళం, పార్వతీపురం-మన్యం విజయనగరం జిల్లాల ప్రజలు క్యాన్సర్‌కు సరైన వైద్య సేవలు అందక ఇబ్బంది పడుతున్నారని , తక్షణమే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. మంగళవారం కలెక్టరు అంబేద్కర్‌ని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ స్ర్కీనింగ్ సెంటర్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అత్యవసర చికిత్స కోసం విశాఖపట్టణం వెళ్లి ఆర్థికంగా చితికిపోయి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. జిల్లా కేంద్రాసుపత్రిలో అత్యవసరంగా క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభాకరరావు, రామచంద్రరావు, రాజారావు, అప్పారావు, శ్రీను, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.